Monday, August 29, 2011

తీహార్ జైల్లో డాడీ


బంగారు కమ్మెల జైలు కిటికీ లోంచి చొరబడి నా కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తున్న సూర్య కిరనాలనుంచీ తప్పించుకొంటూ మెత్తటి పరుపు మీద ముసుగు మొహం పైకి లాక్కొని కూలరు గాలికి హాయిగా కునుకేస్తున్న నేను టక్ టక్ అన్న శబ్దానికి ఉల్లిక్కి పడి లేచాను.ఒక చేతిలో లాఠితో కానిస్టేబుల్ సౌమ్య  "సార్ లెగండి ,లేట్ అయితే టిఫ్ఫిన్ వుండదు"

ఇక్కడకి ఏ తప్పు చేసి వచ్చానో,ఎలా వచ్చానో నాకు పూర్తిగా గుర్తు లేదు,వచ్చి ముప్పై సంవస్తరాల పైనే అయ్యింది.తెల్లటి టీ షర్టు,పొట్టి నిక్కరు వేసుకొని పరిగెడుతున్న ఆ పిల్లాడు ఎవరు ? అసలు ఇక్కడకి ఏ నేరం చేసి వచ్చాడు? అడుగుదామని ఎంత ప్రయంత్నిచినా ఆగడే.కానిస్టేబుల్ రామయ్యను అడిగితే ,"ఏమో మీకే తెలియాలి" అంటూ వెటకారంగా నవ్వుతున్నాడు.ఈ రోజు ఎలా అయినా వాడి వివరాలు కనుక్కోవాలి.

ఇన్ని సంవస్తరాలు అయినా, తను జైలుకి రాని భుధవారం లేదు.నాకు ఇష్టమయిన తిను బండారాలు,పచడ్లు,పుస్తకాలు వారానికి సరిపడా తెచ్చి వుంటుంది.దేశంలోనే ప్రసిద్ది గాంచిన జైలు కనుక, బద్రత ద్రుస్య తనని లోపలకి పంపేప్పుడు చెప్పులు కూడా వేసుకోనివ్వరు.వాల్లు ఇచ్చిన దుస్తులు వేసుకొని బాంబు స్కానర్ లోంచి లోపలకి వచ్చింది మంజుల.ఎదురుగ్గా కూర్చొని వున్నా మద్యలో ఈ గాజు గోడ ఏమిటో? ఇలా ఫోన్లలొ మాటాడుకోవటం ఏమిటో ? నా కర్మ కాకపొతే.

బోజనానికి నేను మటుకు లైన్ లో నిలుచోవలసిన అవసరం లేదంట.ముసలి వాడిననో? వొకప్పుడు బాగా బతికిన వాడిననో? సౌమ్య ప్లేటు తెచ్చింది.రోజంతా కూలి పని చెయ్యకుండా జైలరు లైబ్రరీ పని అప్పగించాడు.ఈ చిన్న టీవీ కూడా ఆయన ఇచ్చిందే.అప్పుడప్పుడూ బారీ బందో బస్తుతో బంగారు సంకెల్లు వేసి బయటకు తీసుకువెల్తారు.బస్సు ఎక్కుతుంటే లైన్ లో ముందర మల్లీ అదే పిల్లవాడు.ఈ సారి ఎలా అయినా పట్టుకోవాలని పరిగెత్తాను.ధన్ మని తల పై ఎవ్వరో గట్టిగా కొట్టారు.ఉలిక్కి పడి లేస్తే ఎదురుగ్గా తలుపు తెరుస్తూ నిషిత్.

యడం వైపు అబ్బాయి కొనిచ్చిన ల్యాప్టాప్.పక్కనే నెల క్రితం నేను అమెరికా ఫ్లైటులో చదువటానికి అని కొన్న సాక్షి పత్రికలో వో మూల

"సత్యం రామలింగ రాజుకి జైల్లో రాచబోగాలు"

ఆ కానిస్టేబుల్ సౌమ్య, సౌమ్య మా కోడలే,ఆ జైలరు మా అబ్బాయి ,ఆ పిల్లవాడు సందేహం లేదు మా మనవడే.కానిస్టేబుల్ రామయ్య మా వాడి ఫ్రెండు అషోక్ అయ్యి వుంటాడు.ఆ జైలు బోజనానికి లైన్లు వీసాకి వెల్లినప్పటివా? ఆ బాంబు స్కానర్లు ఎయిర్పోర్టు సెక్యురిటీ చెక్ ఏమో?...

ఇంతలో

"ఏమండీ అబ్బాయి వచ్చే టైం అయ్యింది ,మాల్ కి వెల్దాం రెడీ అవ్వండి అంటూ మంజుల"

మరి బంగారు సంకెల్లో?...